Newer posts are loading.
You are at the newest post.
Click here to check if anything new just came in.

June 05 2018

praveen2017
12:54

విప్లవ కవితల్ని నిషేధించి, ఎర్ర సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు ఇవ్వడం వెనుక మతలబు ఇదే

హరి డోర్నాల అనే ఆయన తన బ్లాగ్‌లో అడిగారు "1980ల టైమ్‌లో కమ్యూనిస్ట్, నక్సల్ బ్యాక్‌గ్రౌండ్‌తో తీసిన సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్ దొరకడం కష్టంగా ఉండేది. అప్పట్లో సోవియట్ సమాఖ్యలో ఎర్ర ప్రభుత్వం ఉండేది కనుక ఇక్కడ కూడా విప్లవం వస్తుందనే భయంతో ఎర్ర సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు అంత తొందరగా ఇచ్చేవాళ్ళు కాదు. 1990లో మాత్రం ఎర్ర సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు ఎలా ఇచ్చారు?" అని. 

నాకు తెలిసినంత వరకు అవి నిజంగా ఎర్ర సినిమాలు కావు. ఫేస్‌బుక్‌లో రామమోహన్ అనే ఆయన వ్రాసాడు "ఆర్.నారాయణమూర్తికి మార్క్సిజం తెలియదు, నిజంగా మార్క్సిజం తెలిసినవాడు తీసిన సినిమాలకైతే ప్రభుత్వం సెన్సార్ సర్టిఫికేట్‌లు ఇవ్వదు" అని. ఆయన ఆర్.నారాయణమూర్తి ఇంటర్వ్యూ ఒకటి ఏదో పత్రికలో చదివాడు. ఆ ఇంటర్వ్యూలో నారాయణమూర్తి ఏమి చెప్పాడ్ప ఆయన వివరంగా చెప్పలేదు. అసలు నారాయణమూర్తి సినిమాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామని నేను "అర్ధరాత్రి స్వతంత్రం" సినిమా చూసాను. ఆ ఒక్క సినిమా చూస్తేనే నారాయణమూర్తికి మార్క్సిజం తెలియదని నాకు కూడా అర్థమైపోయింది. మార్క్సిజం తెలిసినవాడు ఎవడూ మహాత్మా గాంధీని విప్లవకారుడు అనుకోడు. మహాత్మా గాంధీ బహిరంగంగానే కమ్యూనిజమ్‌ని వ్యతిరేకించాడు. సొంత ఆస్తి అనేది ఉంటుందనీ, దానికి పెట్టుబడిదారులే ట్రస్టీలుగా ఉంటారనీ మహాత్మా గాంధీ నమ్మేవాడు. "అర్ధరాత్రి స్వతంత్రం" సినిమాలో నారాయణమూర్తి గాంధేయవాదానికి తన సొంత భాష్యం చెప్పాడు. "సంపద అందరిదీ, దానికి కాపలాదారులు కొందరే అన్న మహాత్మా గాంధీ కూడా విప్లవకారుడే" అనే డైలాగ్ పెట్టాడు నారాయణమూర్తి. విప్లవానికి సంబంధించిన వాస్తవాలని వక్రీకరించి చూపే సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు ఎందుకు ఇవ్వరు? 

"ఒసేయ్ రాములమ్మ" సినిమాలో ఆ వక్రీకరణలు మరీ ఎక్కువగా ఉంటాయి. ఆ సినిమాలో హీరోయిన్ రేప్‌కి ప్రతీకారం తీర్చుకోవడానికీ, ఇన్సెస్ట్ నుంచి తప్పించుకోవడానికీ నక్సలైట్‌గా మారినట్టు చూపించారు. నిజ జీవితంలో అలాంటివాళ్ళు ఎవరూ ఉండరు, ఎవరైనా ఉన్నా వాళ్ళు కత్తుల సమ్మయ్యలాగ పోలీసులకి లొంగిపోతారు. కరీమ్‌నగర్ జిల్లాలో కత్తుల సమ్మయ్య అనే డెప్యూటీ దళ కమాండర్ ఉండేవాడు. అతనికి శ్రామికవర్గ చైతన్యం ఏమాత్రం లేదు. అతను భూస్వాములతో వ్యక్తిగత గొడవల వల్ల పార్టీలో చేరాడు కానీ తరువాత పోలీసులకి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని కోవర్ట్‌గా మార్చి, దళంలోకి తిరిగిపంపించి, అతని చేత ముగ్గురు దళ సభ్యుల్ని కాల్చి చంపించారు. ఆ సినిమాలోని రాములమ్మలాగ ఎవరైనా వ్యక్తిగత అవసరం కోసం దళంలో చేరినా వాళ్ళు కూడా చివరికి కత్తుల సమ్మయ్యలాగ లొంగిపోతారనే లెక్కతో ప్రభుత్వం ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది.

కుబుసం సినిమా వాస్తవానికి కొంచెం దగ్గరగా ఉంటుంది కానీ అది నాన్-కమర్షియల్ సినిమా కావడం, సెన్సార్ బోర్ద్‌వాళ్ళు క్లైమాక్స్ సన్నివేశాన్ని డిలీట్ చెయ్యించడం లాంటి కారణాల వల్ల అది ఫ్లాప్ అయ్యింది. కుబుసం సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్‌తో అంటాడు "యుద్ధానికి మంచిచెడులతో సంబంధం లేదు. నువ్వు మంచివాడివైనంతమాత్రాన శత్రువు నిన్ను చంపకూడదని రూలేమీ లేదు. నువ్వు నిత్యం అలెర్ట్‌గా ఉండాలి. మనం అలెర్ట్‌గా లేని సమయం కోసమే శత్రువు ఎదురు చూస్తుంటాడు" అని. అలాగే భూస్వామి రేప్ లేదా ఇన్సెస్ట్ చెయ్యకపోయినంత మాత్రాన విప్లవకారులు అతన్ని చంపకూడదని రూల్ ఏమీ లేదు. భూస్వామి దానాలు చేసినంతమాత్రాన విప్లవకారులు అతని భూమిలో జెండాలు పాతకుండా ఉండిపోతారనే రూల్ కూడా లేదు. విప్లవాన్ని కూడా సొంత కాల్పనికత దృష్టితో చూసే దాసరి నారాయణరావుకి ఈ విషయాలు తెలియవు కాబట్టే అతను తీసిన ఒసేయ్ రాములమ్మ, రౌడీ దర్బార్ లాంటి సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు వచ్చాయి. 

హరి డోర్నాల గారు కేవలం ఒక తెలంగాణావాది. ఆయన మార్క్సిస్ట్ కాదు. "జై బోలో తెలంగాణా" సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో గొడవ జరిగినప్పుడు ఆయన ఆ ప్రశ్న అడిగాడు. "ఆ సినిమాలు చూసి జనం నక్సలైట్లుగా మారుతారనే భయం ప్రభుత్వానికి లేదు, ఒక తెలంగాణావాద సినిమాని మాత్రమే ఎందుకు నిషేధించాలనుకుంటున్నారు?" అని కూడా ఆయన ప్రశ్నించాడు.

Don't be the product, buy the product!

Schweinderl