Newer posts are loading.
You are at the newest post.
Click here to check if anything new just came in.

July 17 2018

praveen2017
01:51

ఆర్.నారాయణ మూర్తికి కమ్యూనిజం అంటే ఏమిటో కూడా తెలియదు

నిజ జీవితంలో విప్లవకారులు దొరికితే వాళ్ళని చిత్ర హింసలు పెట్టి బూటకపు ఎంకౌంటర్‌లలో చంపించే ప్రభుత్వం ఆర్.నారాయణ మూర్తి సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు ఇచ్చిందంటే దాని అర్థం సినిమాలలోని విప్లవకారులకీ, నిజ జీవితంలోని విప్లవకారులకీ మధ్య తేడా ఉన్నట్టే కదా. మాదాల రంగారావు సినిమాలు నేను రెండో మూడో చూసాను. మాదాల రంగారావు కూడా నిజ జీవితంలో విప్లవకారుడేమీ కాదు. సిపిఐ(మావోయిస్ట్) కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి లొంగిపోవాలనుకుంటున్నాడని మాదాల రంగారావు ప్రచారం చేసాడు. అలాంటిదేమీ లేదని గణపతి సమాధానం చెప్పాడు. మాదాల రంగారావుకి మైండ్ చెడింది అని కూడా గణపతి అన్నాడు. దళ కమాండర్ లొంగిపోతేనే పోలీసులు అతనికి మిగితా నాయకుల అడ్రెస్‌లు చెప్పమని హెరాస్ చేస్తారు. నయీం, బయ్యపు సమ్మిరెడ్డి లాంటివాళ్ళు ఇన్‌ఫార్మర్‌లుగా మారినది అందువల్లే కదా. పార్టీ నాయకులందరి అడ్రెస్‌లు తెలిసిన కేంద్ర కమిటీ కార్యదర్శి లొంగిపోతే, అతను మిగితావాళ్ళ అడ్రెస్‌లు చెప్పకపోతే, పోలీసులు అతన్ని బతకనిచ్చే అవకాశం లేదు. ఈ విషయం గణపతికి తెలిసే ఉంటుంది. నయీం, సమ్మిరెడ్డి లాంటివాళ్ళ వ్యవహారం మనకే తెలిసినప్పుడు అది పార్టీ సీనియర్ నాయకులకి తెలియదనుకోలేము. ఎర్ర బ్యానర్ కింద సినిమాలు తీసేవాళ్ళకి మాత్రం ఇవన్నీ తెలియాలని రూల్ లేదు. 

ఆర్.నారాయణ మూర్తికి కూడా కమ్యూనిజం అంటే ఏమిటో తెలియదు. ఆయన ఒక పత్రిక ఇంటర్వ్యూలో తాను మంచి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ప్రభుత్వం ఉన్నదే సొంత ఆస్తి వ్యవస్థని పరిరక్షించడానికి. సొంత ఆస్తి లేకపోతే పోలీస్ స్టేషన్‌లూ, కోర్ట్‌లూ, తహసీల్‌దార్ ఆఫీసులూ అవసరం ఉండవు. ఈ విషయం నారాయణ మూర్తికి తెలియదు. 

ఆర్.నారాయణ మూర్తి పాలక వర్గ నాయకుడైన కెసిఆర్‌ని పొగడడం గురించి ఒక సారి ఫేస్‌బుక్‌లో చర్చ జరిగింది. పాలక వర్గానికీ, విప్లవకారులకీ మధ్య శత్రుత్వం ఉంటే ప్రభుత్వం ఆర్.నారాయణ మూర్తి సినిమాలకి సెన్సార్ సర్టిఫికేట్‌లు ఎలా ఇచ్చింది అని నేను ఒక వ్యాఖ్యలో అడిగాను. దానికి రామమోహన్ అనే ఆయన సమాధానం వ్రాసాడు "ఆర్.నారాయణమూర్తికి మార్క్సిజం తెలియదు. దానికి ఆయన ఇంటర్వ్యూయే సాక్ష్యం. మార్క్సిజం తెలియకపోవడం తప్పు కాదు. ప్రభుత్వాన్ని కూల్చే రహస్యాన్ని ప్రభుత్వం బయటపడనివ్వదు" అని. ఆ ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి ఏమన్నాడు అని రామమోహన్‌ని నేను అడిగాను. తనకి సరిగా గుర్తు లేదు అని రామమోహన్ అన్నాడు.

"జై బోలో తెలంగాణా" సినిమా సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో గొడవ జరిగినప్పుడు కూడా కొందరు అడిగారు "ఎర్ర సినిమాలు చూసి జనం నక్సలైట్లుగా మారుతారనే భయం ప్రభుత్వానికి లేదు కానీ ఒక తెలంగాణావాద సినిమా అంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం?" అని. అసలు ఆర్.నారాయణ మూర్తి సినిమాలలో ఏముందో తెలుసుకుందామనే నేను ఆయన నిర్మించిన "అర్ధరాత్రి స్వతంత్రం" సినిమా చూసాను. ఆ సినిమాలో నారాయణ మూర్తి విప్లవకారులని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవాళ్ళుగా, పారలెల్ గవర్నమెంట్ నడిపేవాళ్ళుగా చూపించాడు. కమ్యూనిజం రావడం ఏమాత్రం ఇష్టం లేని మహా ధనవంతులు కూడా అలాంటి థీమ్‌తో సినిమా తియ్యగలరు. అందుకే కదా కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన దాసరి నారాయణరావు, తెలుగు దేశం ఎం.పి. అయిన మోహన్ బాబు కూడా ఎర్ర సినిమాలు తియ్యగలిగారు. 

"అర్ధరాత్రి స్వతంత్రం" సినిమాలో ఆర్.నారాయణమూర్తి విప్లవాన్ని ఎలా నేరో వ్యూలో చూపించాడో నేను ఫేస్‌బుక్‌లో వ్రాసాను. అప్పుడు రామమోహన్ నేను అడిగిన పాత ఇంటర్వ్యూ సారాంశాన్ని గుర్తుతెచ్చుకుని వ్రాసాడు. "ఆర్.నారాయణమూర్తి మంచి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాడనేది ఆ ఇంటర్వ్యూ సారాంశం" అన్నాడు రామమోహన్. లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ కూడా మంచి ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటాడు. కేవలం మంచి ప్రభుత్వం కావాలంటే లోక్ సత్తానే నమ్ముకుంటే సరిపోతుంది. దాని కోసం ఎర్ర జెండా పట్టుకోవాల్సిన అవసరం లేదు. 

కమ్యూనిజం అంటే సొంత ఆస్తిని రద్దు చెయ్యడం. గ్రీక్ భాషలో కమ్యూనిస్ అంటే ఉమ్మడి అని అర్థం. కమ్యూనిజం అంటే ఉమ్మడి ఆస్తి వాదం. కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్‌గా మారకముందు కూడా కొంత మంది కమ్యూనిస్ట్‌లు ఉండేవాళ్ళు. వాళ్ళు ఊహాస్వర్గ కమ్యూనిస్ట్‌లు & క్రైస్తవ కమ్యూనిస్ట్‌లు. ఊహాస్వర్గ కమ్యూనిస్ట్‌లకి వర్గాల గురించి తెలియదు. శ్రామిక వర్గ పోరాటం అనేది వాళ్ళ థియరీలో ఉండదు. ఊహాస్వర్గ కమ్యూనిస్ట్‌లు కూడా నాయకుడు అవసరం లేని సమాజాన్ని కోరుకుంటారు. ప్రభుత్వం బాగుంటే ప్రజలు బాగుంటారని ఏ కమ్యూనిస్టూ అనుకోడు. ఆర్.నారాయణమూర్తికి కమ్యూనిజం అంటే ఏమిటో కూడా తెలియదు. అతనికి మార్క్సిజం తెలిసే అవకాశం లేదు. అతని సినిమాలు సొంత ఆస్తి సంబంధాలని ఒక ఇంచ్ కూడా కదపలేవు. ఆ సినిమాలకి ప్రభుత్వం సెన్సార్ సర్టిఫికేట్‌లు ఇవ్వడం విచిత్రం కాదు.

ఇండియాలో కమ్యూనిజం అంటే ఏమిటో తెలియనివాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక కమ్యూనిజం గురించి తెలియకపోవడం తప్పు కాదు. కమ్యూనిజం అంటే ఏమిటో తెలిస్తే ఆర్.నారాయణమూర్తి దాన్ని అంగీకరిస్తాడా లేదా అనేదే ఇక్కడి సందేహం. కార్ల్ మార్క్స్ కూడా మొదట్లో కమ్యూనిజంని అంగీకరించలేదు. అతను కొన్ని ఫ్రెంచ్ రచనలు చదివిన తరువాతే కమ్యూనిజంని అంగీకరించాడు. కమ్యూనిజం అంటే ఏమిటో తెలియకుండానే ఎర్ర సినిమాలు నిర్మించిన వ్యక్తికి సడెన్‌గా కమ్యూనిజం అంటే ఏమిటో తెలిస్తే అతను దేన్ని అంగీకరిస్తాడు అనేది సందేహమే. ఉమ్మడి ఆస్తి వ్యవస్థని స్థాపించడం సాధ్యం అని చెపితే మొదట్లో నేను కూడా అంగీకరించలేదు. "కొండలు, గుట్టలు ఉన్న భూమిని సాగు చెయ్యడం కష్టం. ఆ భూమి యొక్క ఉమ్మడి యాజమాన్యాన్ని ఎవరు అంగీకరిస్తారు" లాంటి ప్రశ్నలు నేను కూడా అడిగేవాణ్ణి. ఇప్పుడు నేను కమ్యూనిజంనే సమర్థిస్తాను కానీ కమ్యూనిజం అంటే ఏమిటో తెలియకుండా కమ్యూనిజంని అంగీకరిస్తే దాని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు అంటాను . 
Tags: Movies

Don't be the product, buy the product!

Schweinderl